రోడ్డు వేయండి సారూ..

రోడ్డు వేయండి సారూ..
రోడ్డు వేయండి సారూ..
  •  అధ్వానంగా ఉన్న రోడ్లు..
  • ఆ మార్గాల్లో ప్రయాణించాలంటేనే హడలిపోతున్న ప్రజలు
  •  మరమ్మతులకూ నోచుకోని వైనం

కొత్తూరు వ్యాప్తంగా పలు రోడ్లు బావులను తలపిస్తున్నాయి.

అసలు తాము వెళుతోంది రోడ్డుపైనా.. లేక చిన్న బావుల్లో వెళుతున్నామా.. అనే అనుమానం ప్రయాణీకులకు కలుగుతోంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కనీసం నడవడానికి కూడా వీలులేనంత దుస్థితిలో రోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం కొత్తూరులో ఉన్న పలు రోడ్లపైన ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ నీటిమడుగులను తలపిస్తున్నాయి. ద్విచక్రవాహనదారులు నీరున్న ఆ గుంతల్లో దిగితే ప్రమాదానికి గురి కావలసిందే. రోజూ వేలాది మంది ప్రజలు ప్రయాణించే ఈ రోడ్లను ఒకసారి పరిశీలిస్తే..

మహాప్రస్థానం, కొత్తూరు/శ్రీకాకుళం: కొత్తూరు మండలంలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. చినుకుపడితే చిత్తడిగా తయారవుతున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. రాకపోకలు సాగించలేక ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తిప్పలు ఎదుర్కొంటున్నారు. నిధులు ఉన్నా సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారవుతోంది. నిధులు ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురించింది. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. శ్రీకాకుళం - కొత్తూరు రోడ్డు మార్గంలో ఆర్అండ్‌బీ రోడ్డుపైన పెద్ద పెద్ద గుంతలు పడి ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు వెళ్లేటప్పుడు టైర్లు సైతం ఆ గుంతల్లో మునిగిపోతున్నాయి. ఇక ఆటోలు, ద్విచక్రవాహనాల సంగతి సరేసరి. కొత్తూరు - పాలకొండ వెళ్లే తారు రోడ్డుపైన పలుచోట్ల గుంతలు పడ్డాయి. వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మరీ దుస్థితిలో ఉన్న రోడ్లు ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. గ్రామీణ ప్రాంత రోడ్లు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.